సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ యువతని ప్రోత్సహిస్తుందని.. బీసీలంటే టీడీపీ అని తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టాకనే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశంలోనే మొదటిగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు. కేసులు పెడితే బీసీలందరూ ఇళ్లలో కూర్చొంటారని జగన్ అనుకున్నారన్నారు. ఎంతో మంది బీసీలను జగన్ ప్రభుత్వం హత్య చేసిందన్నారు. చీరాలలో వివాహితను వివస్త్రని చేశారని మండిపడ్డారు. అమర్నాధ్ గౌడ్‌ని అత్యంత దారుణంగా హతమార్చారని చెప్పారు. జగన్ బీసీలను బానిసలుగా చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏపీలో బీసీల మీద ఘోరాలు జరుగుతుంటే, ఒక్క వైసీపీ బీసీ నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీ బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురాబోతుందని తెలిపారు. అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తానన్నాడని.. మంత్రి పదవి పోయిందని.. చివరకు ఆయన నరసరావుపేట వలస వెళ్లాడని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.