నేడు ప్రతిభ ఉన్నా... అందుకు తగ్గ పని దొరకడం గగనమై పోయిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శుక్రవారం టీడీపీ నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారు. కంపెనీలు తేకపోగా.. జగన్ ఉన్న వాటిని కూడా తరిమేశారని మండిపడ్డారు. వేల మందికి ఉపాధి ఇచ్చిన అమర్ రాజా కంపెనీ వెళ్లిపోయేలా చేశారన్నారు. జగన్ భస్మాసుర హస్తంతో ఆ కంపెనీని భస్మం చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పుడు అమర్ రాజా కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. చంద్రబాబు పాలనలో లక్షల మందికి ఉపాధి దొరికిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి, లక్షల మందికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు ముందుచూపే అని చెప్పుకొచ్చారు. అమరావతిలో కూడా ఇలా అభివృద్ధి చేయాలని చూస్తే జగన్ వచ్చి చంపేశారని మండిపడ్డారు. కేశినేని శివనాధ్ ఆధ్వర్యంలో ప్రతిచోటా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని.. యువతకి ఒక మార్గ నిర్దేశకత్వం చేస్తున్నారని తెలిపారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినతి చేశారు.