ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ అరెస్ట్ ఊహాగానాల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 09:53 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ.. ఆ రాష్ట్ర సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా సమన్లు జారీ చేస్తోంది. అయితే ఈడీ ఇచ్చిన సమన్లు రాజకీయ ప్రేరేపితం అని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.. విచారణకు హాజరు కాకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికే 6 సార్లు నోటీసులు ఇచ్చినా.. విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో బల నిరూపణ కోసం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై శనివారం ఢిల్లీ శాసనసభలో చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేజ్రీవాల్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వా్న్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. తప్పుకు కేసులు పెట్టి దేశంలోని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పార్టీలను విడగొట్టి ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


ఢిల్లీ మద్యం పాలసీ కేసు పేరు చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎప్పటికీ గెలవలేమని తెలుసుకున్న బీజేపీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని.. వారందరూ తనతోనే ఉన్నారని ఢిల్లీ ప్రజలతో పాటు దేశం మొత్తానికి చూపించేందుకే తాను ఈ విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇటీవలె ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయగా.. ఈ సమయంలోనే విశ్వాస పరీక్షకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే ఎటు చూసినా ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష నెగ్గేలాగే కనిపిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 62, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ గెలవడం సునాయసంగానే కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఢిల్లీ అసెంబ్లీలో పెట్టిన విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్న వేళ.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com