ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ .. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే మీడియాలో ప్రచారం, ప్రకటనల విషయంపైనా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుంచి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు రాష్ట్ర కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని అన్నారు.
గురువారం మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయమై ముకేశ్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కీలక సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని అనుకునే తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను సీఈవో కోరారు.
మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపు కోసం ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ లను ఏర్పాటు చేస్తుంటారు. రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ చానల్స్, లోకల్ కేబుల్ నెట్ వర్క్స్ లో ప్రసారం చేయాలని అనుకునే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీతో ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.