గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో సుమారు 17 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నాయని సుచరిత.. జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని రావటం సహా ఇతరత్రా కారణాలతో ఈ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని వివరించారు. వీరికి ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచాల్సిందిగా సీఎం జగన్‌ను కోరారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ప్రసంగంలో సీఎం జగన్.. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు పింఛన్ పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో సాధారణ పింఛన్లు వేయి రూపాయలుగా ఉన్నప్పుడు.. అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి రెండున్నర వేలు పింఛనుగా ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య, వితంతు పింఛన్లను మూడు వేలకు పెంచామని జగన్ వెల్లడించారు. అలాగే రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన 17 వేల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి ఇచ్చే పింఛన్ కూడా రెండున్నర వేల నుంచి ఐదువేలకు పెంచుతామని ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలు చేస్తామని వెల్లడించారు.