వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలనే సంకల్పంతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తారు. 2023లో అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని జరిపించేందుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కావటం అర్హతగా నిర్ణయించింది.. అలాగే పెళ్లికూతురి కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా.. వరునికి 21 ఏళ్ళుగా నిర్ణయించింది. బాల్య వివాహాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలుచేస్తున్న ఏపీ ప్రభుత్వం.. త్రైమాసికానికి ఒకసారి నిధులు విడుదల చేస్తూ వస్తోంది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి.. ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లను ఏపీ ప్రభుత్వం జమ చేసింది. ఎస్సీ సామాజికవర్గంలోని లబ్ధిదారులకు లక్ష రూపాయలు, ఎస్సీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ. 1,20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే ఎస్టీలలోని లబ్ధిదారులకు రూ. 1,00,000, ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ. 1,20,000 సాయంగా అందిస్తున్నారు.
ఇక బీసీ సామాజికవర్గాలలో అర్హులైన లబ్ధిదారులకు రూ. 50,000 ఆర్థిక సాయం అందిస్తోన్న ప్రభుత్వం.. కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. మైనార్టీలు, దూదేకుల సామాజిక వర్గాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.1,00,000 ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం.. విభిన్న ప్రతిభావంతులకు రూ. 1,50,000 అందిస్తోంది. భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది.