ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్‍సీ కాస్త ఉపశమనం కలిగించే వార్త అందింది. క్లర్క్ ఉద్యోగాల నియామకం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్వహిస్తున్న క్లరికల్ పరీక్షల తేదీల్లో మార్పు చేయాలని ఏపీపీఎస్‌సీ కోరింది. ఈ మేరకు ఎస్బీఐకు ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు. అసలు విషయానికి వస్తే.. ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు పరీక్ష ఉంది. ఇక అదే రోజు గ్రూప్ 2 పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. కొంతమంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవటంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ తీరుపై ఉద్యోగ అభ్యర్థులు విమర్శలు గుప్పించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజునే.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను షెడ్యూల్ చేయడంపై నిరుద్యోగులు మండిపడ్డారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షల తేదీని ఖరారు చేసేటప్పుడు ఇతరత్రా పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని షెడ్యూ్ల్ చేసిందనే విమర్శలు వచ్చాయి.
విమర్శల నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్షల తేదీని మార్పు చేయాలంటూ ఎస్‌బీఐకు లేఖరాసింది. అయితే ఏపీపీఎస్సీ లేఖపై ఎస్‌బీఐ ఎలా స్పందిస్తుందనేదీ చూడాలి మరి.