మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పొలిటికల్ కామెంట్ లేదా రాజకీయ నిర్ణయాలు కారణం ఏదైనా.. రెండ్రోజులకు ఒకసారి వార్తల్లో నిలుస్తున్నారు బాలినేని. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి మరో సారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రస్తుత రాజకీయాలపై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే చాలా ఇష్టంగా ఉండేదన్న బాలినేని.. ఇప్పుడు బూతులు తప్ప ఇంకేం లేవని అన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నీ ఛండాలంగా తయారయ్యాయని అన్నారు. ఒంగోలులో మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి బాలినేని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
" ఒకప్పుడు రోశయ్యగారు మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలని అనిపించేంది.. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్. రోశయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేయడం నా అదృష్టం. నేను గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓ సమస్య వచ్చింది. వెంటనే రోశయ్యగారు గవర్నర్‌కు ఫోన్ చేసి బాలినేని తన స్నేహితుడి కొడుకు, తాను తప్పుచేయడని చెప్పి వెనకేసుకుని వచ్చారు. కానీ, ఇప్పుడు అన్నీ ఛండాలమైపోయాయ్.." అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తుపాను విపత్తుల సమయంలోనూ తాను నిరుపేదలకు చేసిన సాయాన్ని రోశయ్య ప్రత్యేకంగా అభినందించారని బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో రోశయ్య తన చమత్కారంతో అందరినీ నవ్వించేవారన్న బాలినేని గతాన్ని గుర్తుచేసుకున్నా్రు. ప్రతిపక్ష నేతలను సైతం తన చమత్కారంతో నవ్వించగల నేత రోశయ్యగా అభివర్ణించారు. అలాగే సభలో రోశయ్య హావభావాలను బాలినేని ఇమిటేట్ చేయటంతో సభకు హాజరైనవారంతా సరదాగా నవ్వుకున్నారు.
అయితే వైసీపీ అధిష్టానంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారంటూ ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆయనతో అధిష్టానం పదేపదే చర్చలు జరపడం కూడా జరిగింది. అయితే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డికే టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టడం.. అధిష్టానం నుంచి అందుకు సానుకూలత వ్యక్తం కాకపోవటంతో బాలినేని అలిగారనే వార్తలు వచ్చాయి. చివరకు ఒంగోలు ఎంపీ సీటుతో తనకు పనిలేదని, తన అసెంబ్లీ సెగ్మెంట్ వ్యవహారం చాలంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యారు.