చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ ఆఫీసర్ చెల్లనివిగా ప్రకటించి పక్కకుపెట్టిన 8 బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సిందేనని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆ చెల్లని 8 ఓట్లను కూడా కలుపుకుని మళ్లీ మేయర్ ఎన్నిక కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వాటిని చెల్లుబాటు అయ్యే ఓట్లుగా పరిగణించి వాటిని కూడా లెక్కించాలని తీర్పును వెలువరించింది. దీంతో గత కొన్ని రోజులుగా చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది
ఈ వ్యవహారంపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్వో అనిల్ మాసిహ్.. 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. ఈ క్రమంలోనే వాటిని చెల్లుబాటు కాకుండా చేసి.. అత్యధిక కౌన్సిలర్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించారని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించాలని తీర్పును వెలువరించింది.
ఇక ఈ 8 ఓట్లు పరిగణలోకి తీసుకుని మరోసారి కౌంటింగ్ నిర్వహిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున ఉన్న అభ్యర్థికి స్పష్టమైన విజయం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సోమవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఎన్నికల రిటర్నింగి అధికారి అనిల్ మాసిహ్ వ్యవహారంపై సీరియస్ అయింది. సీసీటీవీ కెమెరాలను చూస్తూ బ్యాలెట్ పేపర్లపై ఎందుకు ఎక్స్ మార్క్ పెట్టారంటూ నిలదీసింది. అయితే దానికి అనిల్ మాసిహ్ చెప్పిన సమాధానంపై సంతృప్తి చెందని.. సుప్రీంకోర్టు.. నేడు మరోసారి విచారణ జరిపింది.
గత నెల 30 వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికలు జరిగాయి. మొత్తం చండీగఢ్ కార్పొరేషన్‌లో 35 మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో ఆప్-కాంగ్రెస్ కూటమికి 20, బీజేపీకి 14, ఎస్ఏడీకి ఒక కౌన్సిలర్ ఉన్నారు. అయితే మేయర్ ఓటింగ్ సందర్భంగా ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది కౌన్సిలర్ల ఓట్లను చెల్లనివిగా ప్రకటించిన ఆర్వో అనిల్ మాసిహ్.. బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు. అయితే కౌన్సిలర్ల బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఎక్స్ మార్క్ పెడుతున్నట్లు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.