అక్కడ పురుషులు అంతా ఏటా నగ్నంగా ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఉత్సవాలు ఇప్పటివి కాదు.. గత 1000 సంవత్సరాలుగా ఈ నగ్న ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను చూసేందుకు దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకలు వస్తారు. అయితే ఈ నగ్న ఉత్సవం అంతరించిపోయే దశలో ఉంది. వీటిని భవిష్యత్‌లో నిర్వహించకూడదని అక్కడి వారు నిర్ణయించారు. దానికి కూడా ఓ కారణం ఉంది. ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో పాల్గొనేవారి సంఖ్య ఏడాదికి ఏడాది తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నగ్న ఉత్సవం జపాన్‌లో నిర్వహిస్తారు.
జపాన్‌లో గత 1000 ఏళ్లుగా హడకా మత్సూరి లేదా సోమిన్ సాయి అనే పేరుతో న్యూడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్ అనేది వారి సంప్రదాయంగా శతాబ్దాల నుంచి వస్తోంది. జపాన్ ఉత్తర ప్రాంతంలోని ఇవాట్ ప్రి ఫెక్చర్‌లోని అడవిలో కొకుసేకి-జి ఆలయం వద్ద ఈ నగ్న ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో వందలాది మంది యువకులు నగ్నంగా పాల్గొంటారు. ఈ ఉత్సవంలో జస్సో జోయాసా ( చెడును అంతం చేయడం) అనే నినాదాలు చేస్తారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను చూసేందుకు ప్రతీ సంవత్సరం వేలాది మంది జపాన్ వాసులే కాకుండా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా హాజరవుతారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్ ఈ ఏడాది ముగిసింది. గత కొన్నేళ్లుగా ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో దానికి ప్రాబల్యం కూడా క్రమంగా తగ్గుతోంది.
అయితే జపాన్‌లో ఈ నగ్న పండుగలో పాల్గొనడానికి ధైర్యం చేసే యువకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోందని స్థానికులు చెబుతున్నారు. శతాబ్దాల ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచిన గత తరం ప్రజలు ఇప్పుడు వృద్ధులు కావడంతో.. కొత్తగా యువత ఇలాంటి ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇక జపాన్‌లో ఈసారి నిర్వహించిన న్యూడ్ ఫెస్టివల్ చివరిది అని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
సాధారణంగా ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో యువకులు మాత్రమే పాల్గొంటారు. ఇందులో పాల్గొనే యువకులు కేవలం తెల్ల గుడ్డను మాత్రమే తమ ప్రైవేటు భాగాలపై కప్పుకుంటారు. చాంద్రమాన నూతన సంవత్సరం ఏడవ రోజు రాత్రి మొత్తం ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. మొదట నగ్నంగా ఉన్న యువకులు కొకుసేకి-జీ ఆలయ సమీపంలోని యముచి నదిలో చలిలో స్నానం చేసి చెడును అంతం చేయండి అంటూ అరుస్తూ ఆలయంలోకి పరిగెత్తుతారు.
ఆ తర్వాత యువత మధ్య వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ రాత్రి ప్రారంభం అయి.. ఉదయం వరకు కొనసాగుతుంది. చివర్లో సోమిన్ అనే ఓ బ్యాగును తెచ్చుకునేందుకు యువకుల మధ్య పోటీ ఉంటుంది. అయితే ఈ పోటీనే ఈ నగ్న ఉత్సవంలో హైలెట్‌గా నిలుస్తుంది. వందలాది మంది పురుషులు చెక్కతో కూడిన గుడి లోపల కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ దూకుడుగా ఆ బ్యాగ్‌పై దూకుతారు. అయితే వెయ్యేళ్ల క్రితం ప్లేగు వంటి అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఈ సీజన్‌లో అక్కడ విపరీతమైన చలి ఉన్నా.. యువకులు బట్టలు లేకుండా నదిలో చిందులు వేస్తూ పండుగ జరుపుకుంటారు.