పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. గురువారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘పవన్ కల్యాణ్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయి. పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడని, ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని, ఇప్పుడు ఓట్లు కొనుక్కోమని క్యాడర్‌కు లైసెన్స్ ఇచ్చాడని మంత్రి అంబటి ధ్వజమెత్తారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, పవన్, చంద్రబాబును జనసైనికులు నమ్మవద్దని మంత్రి అంబటి హితవు పలికారు. ‘సిద్ధం’ సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలిగిపోతున్నాయి. మళ్లీ సీఎంగా వైయస్ జగనే అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తాం. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గులేకుండా చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు. సీఎం వైయస్ జగన్‌ను సవాల్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబుతో చర్చకు నేనే సిద్ధం. టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధం. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదు అంటూ మంత్రి చురకలు అంటించారు.