ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు.. ఈ నెల 26న కీలకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 09:38 PM

ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో APCC చీఫ్ వైఎస్ షర్మిలతో సీపీఎం నేతలు గఫూర్, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్ రావు.. సీపీఐ నుంచి రామకృష్ణ, నాగేశ్వర రావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరయ్యారు. ఈ మేరకు వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26న అనంతపురంలో జరిగే ఖర్గే సభకు కమ్యూనిస్టు పార్టీలను షర్మిల ఆహ్వానించారు. కలిసి పోరాడకుంటే అధికార పార్టీని గద్దె దిండచం అసాధ్యమన్నారు షర్మిల.


పొత్తుల‌పై తమ‌ మధ్య చర్చ జరిగిందని.. ముందు ప్రజా సమస్యపై కలిసి వెళతామని తెలిపారు. బీజేపీకి వైఎస్సార్‌సీపీ, టీడీపీలు బీటీమ్‌లుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. బీజేపీ, వైఎస్సార్‌సీపీలను దెబ్బ కొట్టేలా పని చేస్తామన్నారు. రామభక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను తుంగలో తొక్కారన్నారు.


ఈ అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తాము కలిసి నడవాలని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీలను ఓడించాలన్నారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. గత పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమన్నారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదన్నారు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు చెప్పారని గుర్తుచేశారు.


కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎపికి అప్పుడే హోదా వచ్చేదన్నారు. తిరుపతిలోనే ప్రధాని మోదీ పదేళ్లు హోదా ఇస్తామన్నారని.. నేటికీ రాష్ట్ర హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టి, మంత్రి పదవులు తీసుకున్నారన్నారు. చంద్రబాబు హోదా కాదు.. ప్యాకేజీ అని సరిపెట్టారని.. హోదా తెస్తాం తనకు అధికారం ఇవ్వండి అని జగన్ అన్నారని.. బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లల్లో ఒక్క పోరాటం కూడా చేయలేదన్నారు. కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని మండిపడ్డారు.


పోలవరం విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు షర్మిల. హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రాలేదన్నారు. ఉద్యోగాలు ఇక్కడ లేక పొట్ట చేతబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు. అమరావతి రాజధాని అని‌ చంద్రబాబు త్రీడీ‌ చూపారని.. జగన్ అసలు ఏపీకి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. నిన్న తాము చేసిన పోరాటం ప్రజలు చూశారని.. ఒక రాత్రి పార్టీ ఆఫీస్‌లో ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ పోరాటానికి సీపీఎం, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారన్నారు.


మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో తనకు ఉన్న అనుబంధం వేరన్నారు షర్మిల. ఆయన ఎన్ని ఒత్తిడులు ఉంటే పార్టీ మారారో తనకు తెలుసని.. హీ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్ అని కామెంట్ చేశారు. రామకృష్ణకు తనకు రాజకీయాలు లేవు.. తనకు దగ్గర వ్యక్తి అన్నారు. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం తనకు లేదన్నారు. ఆర్కే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com