మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు.. తమపై పెట్టిన కేసుల వివరాలపై ఎస్పీతో సునీత, రాజశేఖర్ రెడ్డి చర్చించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి తమపై అనవసరంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించారని ఎస్పీకి సునీత తెలిపారు. కొందరు వ్యక్తుల ప్రోద్బలంతోనే వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేసి, కేసులు పెట్టారని వివరించారు. పులివెందులకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో తమపై అసభ్యంగా పోస్టులు పెట్టిన అంశాన్ని సునీత ఎస్పీకు ఫిర్యాదు చేశారు.
ఫేస్‌బుక్‌లో వేధింపుల కేసులో అసలు వ్యక్తులపై కాకుండా ఇతరులపై కేసు నమోదు చేశారని సునీత ఆరోపించారరు. ఈ విషయమై హైదరాబాద్‌లో నమోదైన కేసు ద్వారానైనా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అక్రమంగా ఇతర కేసుల్లో ఇరికించారని, బెయిల్ మంజూరైనప్పటికీ బయటకు రాకుండా వేధిస్తున్నారని ప్రస్తావించారు. తన తండ్రి మరణానికి కారణమైనవారిని పట్టుకునేందుకు న్యాయపోరాటం చేస్తున్నామని, అందుకే తమను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నిస్తున్నారని సునీత చెప్పారు. ఎస్పీ కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున వాస్తవాలు ఆయనకు వివరించడానికి వచ్చామని వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులు తెలిపారు.
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానా సంచలన ఆరోపణలు చేశారు. ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం, మరొకరిపై దాడి చేసిన కేసులకు సంబంధించి దస్తగిరి ప్రస్తుతం కడప సెంట్రల్ ఉన్నారు. ఆ కేసుల్లో బెయిల్ మంజూరైనా ఆయనను విడుదల చేయలేదు. దస్తగిరిని ఆయన భార్య షబానా ములాఖత్‌లో కలిశారు. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల రాజ్యాంగం నడుస్తోందన్నారు.
ఈ కేసులో పోలీసులు తొలుత ఎఫ్‌ఐఆర్‌లో తన భర్తను ఏ3గా చేర్చారని.. బెయిల్ వచ్చిన క్రమంలో ఏ1గా మార్చారన్నార. ఆయన బయటకు వస్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో విడుదల కాకుండా చేస్తున్నారన్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరిస్తుండటంతో ఆయన భయపడుతున్నారన్నారు. తన భర్తను జమ్మలమడుగు శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, ఎర్రగుంట్ల సీఐ, అప్పటి జమ్మలమడుగు డీఎస్పీలు కుట్రపన్ని జైలుకు పంపించారని ఆరోపించారు. మొత్తానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, వైఎస్ సునీత రెడ్డి పెట్టిన కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.