కర్ణాటకలో మంకీ ఫీవర్ తెగ టెన్షన్ పెడుతోంది. అక్కడ వరుసగా మంకీ ఫీవర్ మరణాలు నమోదు అవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలరోజుల్లో కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ముగ్గురు మృతి చెందడం సంచలనంగా మారింది. మరోవైపు.. కర్ణాటకలో యాక్టివ్ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య కూడా 100 దాటడం మరింత భయాందోళనలు కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ ఫీవర్ కేసుల కట్టడికి చర్యలు చేపడుతోంది.
మంకీ ఫీవర్ సోకి ఉత్తర కన్నడ జిల్లాలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సిద్ధాపూర్ మండలం జిడ్డి గ్రామానికి చెందిన మహిళ చనిపోవడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో ఇదే తొలి మంకీ ఫీవర్ మరణం కావడం అక్కడి వారికి కొత్త భయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలోనే మృతుల సంఖ్య నెల రోజుల్లోనే 3 కు ఎగబాకింది. అంతకు ముందు చిక్కమగళూరు, శివమొగ్గలో ఒక్కో మంకీ ఫీవర్ మరణం నమోదు అయింది. మరోవైపు.. కర్ణాటకలో మంకీ ఫీవర్ కేసుల సంఖ్య 103 కి చేరినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఇటీవలె కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ రావు.. 3 జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసీఎంఆర్ అధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. మరింత సమర్థవంతంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే ప్రజలు.. సరైన దుస్తులు వేసుకోవాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పొలాలు, అటవీ ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చిన వారు వేడి నీటితో శుభ్రంగా స్నానం చేయాలని సూచించింది. ఇక ఉత్తర కన్నడ జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదు అయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
మంకీ ఫీవర్ సోకిన వారికి అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలే ఉంటాయని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మంకీ ఫీవర్ కారణంగా మొదట జ్వరం వస్తుందని.. దాంతో పాటు దగ్గు, తలనొప్పి, విరేచనాలు, వాంతులు కూడా అవుతాయని పేర్కొన్నాయి. జ్వరం విపరీతంగా ఉన్నప్పుడు, మానసిక అనారోగ్యం, తీవ్రమైన వణుకు, దృష్టి లోపం వంటివి వస్తాయని తెలిపాయి. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలని వెల్లడించాయి.