వచ్చే ఎన్నికల్లో పోటీపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు క్లారిటీ ఇచ్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని తెలిపారు. 28వ తేదీ నాటికి కూటమిలో బీజేపీ చేరే అవకాశంపై స్పష్టత వస్తుందన్న ఆయన.. బీజేపీ కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతిపక్ష కూటమి నిర్వహిస్తున్న సభలో పాలక పక్షంలో ప్రతిపక్షంగా ఉన్న తాను కూడా పాల్గొంటానని.. ఇవాళో, రేపో వైఎస్సార్‌సీపీకి తన రాజీనామాను సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా ఏ పార్టీ కోరుకుంటే ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తానన్నారు. రెండేళ్ల క్రితమే తనకున్న ఇన్ఫర్మేషన్‌ని కన్ఫర్మేషన్‌గా మార్చుకొని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పానన్నారు.
పర్యావరణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలను చేపట్టారని ఎన్జీటీ స్పష్టమైన తీర్పును ఇచ్చిందని అన్నారు. చెన్నై ఎన్జీటీ విభాగాన్ని మేనేజ్ చేయాలని ఏపీఎండీసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకట్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేశారన్నారు. పర్యావరణ శాఖలో తనకున్న సోర్సెస్ ప్రకారము ఆరా తీయగా రాష్ట్రంలో దారుణమైన ఇసుక దోపిడీ జరిగిందని చెప్పారన్నారు. ఇసుక దోపిడి వల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు కుదేలైపోయారని, ఇల్లు కట్టుకున్న వారు ఎక్కువ ధరలు చెల్లించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. హాలీవుడ్ లో సూపర్ మెన్, స్పైడర్ మెన్ తరహాలో రాష్ట్రంలో సాండ్ మెన్ ఉన్నారని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఐదేళ్ల తన పాలనలో ఇసుక తవ్వకాలలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఒక పోలీసు అధికారి పేర్కొంటూ.. ఆయన రక్షణ నిమిత్తం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి ఉన్న ప్రాణహానికి, రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడానికి అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రాణహాని ఉందని ఇకపై ముఖ్యమంత్రి నేలపై నడవరా?, కేవలం గాలిలోనే తిరుగుతారా? అంటూ సెటైర్లు పేల్చారు. ఒక్కొక్క హెలికాప్టర్‌కు రూ.కోటి 91 లక్షలు నెలసరి అద్దెకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రక్షణ కోసం అద్దెకు తీసుకోవాలని సూచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
ఇక పైలట్ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు 30 నుంచి 40 వరకు అదనంగా ఉంటాయంటున్నారు.
హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం సరికాదంటూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రఘురామకృష్ణ రాజు తెలిపారు. హెలికాప్టర్లలో డబ్బుని తరలించే అవకాశం ఉందని అందుకే హెలికాప్టర్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయాలలో పోలీసులతో తనిఖీలను చేయించాలని కోరానన్నారు. ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖపై అధికారులు తక్షణమే స్పందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చర్చి ఫాదర్ లకు కుక్కర్లను పంపిణీ చేసి, మత ప్రచారాన్ని నిర్వహించిన పెనమలూరు వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్, మంత్రి జోగి రమేష్ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగానే తక్షణమే స్పందించారని గుర్తు చేశారు. ఈ విషయంపై కూడా అదేవిధంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు అయితే వారికి జీతం ఎందుకు ఇస్తున్నారని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండవని, వాలంటీర్లు కేవలం స్వచ్ఛంద సేవకులని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాలంటీర్లకు ఒకవైపు వేతనం ఇస్తూ, మరొకవైపు సేవారత్న, ఆ రత్న, ఈ రత్న అవార్డుల పేరిట రూ.375 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు వారిని ఎన్నికల సమయంలో ఏజెంట్లు గా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసినప్పటికీ, మరొకవైపు అధికార పార్టీ నాయకులు ఎన్నికల ఏజెంట్లుగా వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.