దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ నియామక అర్హత విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టులో మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి ఉండాలన్న నిబంధనను రద్దుచేసింది. ప్రతిభావంతులైన వారిని అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ)ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి ఆయా రాష్ట్ర హైకోర్టు న్యాయవాది అవుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.
ఎండోమెంట్ బోర్డు అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీకి 2021 నవంబర్ 16న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. అయితే, అభ్యర్థుల అర్హతల విషయంలో మెలిక పెట్టింది. లా డిగ్రీతో పాటు హిందూ మతాన్ని ఆచరిస్తూ, తప్పనిసరిగా హైకోర్టులో న్యాయవాదిగా మూడేళ్లు ప్రాక్టీసు చేసి ఉండాలనే నిబంధన విధించింది. దీనిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. చీరాలకు చెందిన కె.రేఖ, గుంటూరుకు చెందిన కె.లలిత, బెజవాడకు మంజులదేవి వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ లాయర్లు జీవీ శివాజీ, జె.సుధీర్, పి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు.