ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందనే మాట వినే ఉంటాం. అలాగే తీగ లాగితే డొంక కదిలిందనే నానుడి కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. సుమారు 150 కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి.. ఊహించని రీతిలో పోలీసులకు పట్టుబట్టాడు. కేవలం రెండు తులాల గొలుసు ఇన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అతన్ని పోలీసుల చేతికి చిక్కేలా చేసింది. ఇక అసలు సంగతిలోకి వస్తే విశాఖ పోలీసులు 152 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 లక్షల నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న కీర్తన రెసిడెన్సీలో వరలక్ష్మి అనే మహిళ కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే ఫిబ్రవరి పదో తేదీన ఆ కుటుంబం బయటకు వెళ్లింది. తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూసి ఆ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. ఇంటి తాళం విరిగిపోయి ఉంది. లోపల బీరువాలో దాచిన రెండు తులాల బంగారు కొలుసు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ వరలక్ష్మి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాల సాయంతో చోరీ చేసింది శ్రీనివాస్ అనే పాత నేరస్థుడని గుర్తించారు. ఇక దొంగను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సాంకేతికత సాయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న టీకొట్టు వద్ద శ్రీనివాస్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ చేసిన సంగతిని శ్రీనివాస్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు శ్రీనివాస్ పగటిపూట చోరీలు చేయడంలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. ఏపీ, కర్నాటక, తమిళనాడు, గోవాలలో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇతనిపై ఇప్పటి వరకూ 152 కేసులు ఉన్నట్లు చెప్పారు.జల్సాలకు అలవాటు పడిన శ్రీనివాస్ మైసూర్, గోవా, చెన్నై తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.12.45 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, ల్యాప్‍టాప్ స్వాధీనం చేసుకున్నారు.