జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలకు సంబంధించిన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందువుల పూజలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని తిరస్కరించింది. మసీదు సెల్లార్‌లో పూజలకు అనుమతిస్తూ గతంలో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించింది. దీంతో హిందూ పక్షాలకు లైన్ క్లియర్ అయింది. మసీదు సెల్లార్‌లో పూజలకు అనుమతించడంపై ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించలేదు.
కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలోని జ్ఞానవాపీ మసీదులో కోర్టు ఆదేశాలతో భారత పురావస్తు శాఖ శాస్త్రీయ సర్వేను నిర్వహించి, నివేదికను సమర్పించింది. అక్కడ ఒకప్పుడు హిందూ ఆలయం అని, దాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని నివేదిక. మసీదులో హిందూ ఆలయ ఆనవాళ్లు, శాసనాలు గుర్తించినట్టు స్పష్టం చేసింది. నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. ఆలయ సెల్లార్‌లో పూజలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో 30 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 1న సెల్లార్‌లోకి ప్రవేశించిన హిందువులు పూజలు నిర్వహించారు.
అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అప్పటి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. మళ్లీ కోర్టు తీర్పుతో బేస్‌మెంట్‌ను తెరిచి పూజలు ప్రారంభించారు. ఈ పరిణామాలపై ముస్లిం వర్గం ప్రతినిధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పూజలు ప్రారంభించిన వెంటనే నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్టే విధించేందుకు నిరాకరించారు. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.