ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమీ ఉగ్రవాది.. ఒకే ఒక్క క్లూతో పట్టుకున్న పోలీసులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 10:23 PM

నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా-సిమి ఉగ్రవాద సంస్థకు చెందిన హనీఫ్ షేక్ అనే ఉగ్రవాది ఎట్టకేలకు పోలీసుల వలలో పడ్డాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న హనీఫ్ షేక్‌ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులు ఈ నెల 22 వ తేదీన అరెస్ట్ చేశారు. అయితే హనీఫ్ షేక్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వద్ద ఉన్న క్లూ అతనికి ఉన్న మరోపేరు మాత్రమే. హనీఫ్ షేక్‌కు మహ్మద్ హనీఫ్, హనీఫ్ హుదాయి అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 2001లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో హనీఫ్ షేక్‌పై దేశద్రోహం, ఉపా చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటినుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటంతో 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా పోలీసులు ప్రకటించారు.


సిమీ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో నడిచే ‘ఇస్లామిక్ మూవ్‌మెంట్’ అనే మ్యాగజైన్‌కు హనీఫ్ షేక్ ప్రస్తుతం ఎడిటర్‌గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎంతో మంది యువకులను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లేలా చేసినట్లు హనీఫ్ షేక్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా హనీఫ్ షేక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయితే పత్రికలో ఉన్న హనీఫ్ హుదాయి అనే ఒకే క్లూతో ఢిల్లీ పోలీసులు సదరన్ రేంజ్ స్పెషల్ సెల్ హనీఫ్ షేక్ కోసం నాలుగేళ్లుగా గాలింపు చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో జరిగిన సిమి సమావేశాలకు హనీఫ్‌ షేక్‌ నేతృత్వం వహించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమావేశాల సమాచారం తెలుసుకుని దాడులు చేయగా.. పలుమార్లు హనీఫ్ షేక్ తప్పించుకున్నాడు.


ఈ నేపథ్యంలోనే హనీఫ్ షేక్ సమాచారాన్ని అనేక రాష్ట్రాలకు ఢిల్లీ పోలీసులు పంపించారు. 7 రాష్ట్రాల్లో పోలీస్ ఇన్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హనీఫ్ షేక్ తన గుర్తింపు మార్చుకుని మహారాష్ట్రలోని భుసావల్‌లోని ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నట్లు పోలీస్ ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ చేసి చివరికి హనీఫ్ షేక్‌ను అరెస్ట్ చేశారు. ఈ నెల 22న మహ్మదీన్ నగర్ నుంచి ఖడ్కా రోడ్డుకు వెళ్తుండగా.. హనీఫ్ షేక్‌ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.


1997లో సిమిలో చేరిన హనీఫ్ షేక్.. ఉగ్రవాదం వైపు మళ్లాడు. అప్పటి నుంచి యువకులను సిమిలో చేర్చుకోవడం ప్రారంభించాడు. 2001లో అప్పటి సిమి అధ్యక్షుడు సాహిద్ బదర్.. ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఉర్దూ ఎడిషన్‌కు హనీఫ్ షేక్‌ను ఎడిటర్‌గా నియమించాడు. ఆ తర్వాత దేశంలోని ముస్లింలను రెచ్చగొట్టేలా అనేక కథనాలను హనీఫ్ షేక్ రాశాడు. 2001లో అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన హనీఫ్ షేక్.. సిమిలో యువకులను చేర్చుకునేందుకు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో తిరిగినట్లు అంగీకరించాడు. సిమిపై నిషేధం విధించడంతో ‘వహ్దత్-ఎ-ఇస్లాం’ పేరుతో కొత్త సంస్థను స్థాపించాడు. హనీఫ్ షేక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com