ఓ మహిళ వేసుకున్న డ్రెస్ పట్ల పాకిస్థాన్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. దీంతో అక్కడే ఉన్న 300 మంది ఆ మహిళను చుట్టు ముట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను ఆ గుంపు నుంచి రక్షించారు. చివరికి ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మత పెద్దలను పిలిపించారు. అయితే ఆ మహిళ వేసుకున్న డ్రెస్‌పై ఖురాన్ రాతలు ఉన్నాయని.. స్థానికులు ఆమెను చుట్టుముట్టగా.. మత పెద్దలు వచ్చి అవి ఖురాన్ రాతలు కావని తేల్చారు. దీంతో ఆ మహిళతోపాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఒక మహిళ తన భర్తతో కలిసి వెళ్లింది. అయితే ఆమె ధరించిన డ్రెస్‌పై ఏవో రాతలు ఉన్నాయి. అయితే అవి ఖురాన్‌కు సంబంధించినవే అని ఆ రెస్టారెంట్‌లో ఉన్నవారు భావించారు. పవిత్రంగా భావించే ఖురాన్ రాతలను ఆమె డ్రెస్‌పై ధరించి తమ మతాన్ని అవమానిస్తోందని భావించి 300 మంది ఆ మహిళను చుట్టుముట్టారు. ఇది ముమ్మాటికీ దైవదూషణే అని ఆమెను దుర్భాషలాడారు. దీంతో ఆ మహిళ భయంతో చేతులు తన మొహానికి అడ్డుపెట్టుకుని నిలబడింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కొంత మంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు.
ఆ మహిళ ధరించిన కుర్తాను తొలగించాలని అక్కడ ఉన్న కొందరు డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ గుంపు.. మహిళపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉన్న సైదా షెహ్రాబానో నఖ్వీ అనే ఓ మహిళా పోలీస్.. ఆ మహిళను రక్షించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. సైదా షెహ్రాబానో నఖ్వీ చేసిన పనికి అందరి నుంచీ ప్రశంసలు దక్కాయి. ఆ మహిళను ఆ రెస్టారెంట్ నుంచి బయటికి తీసుకురావడానికి సైదా షెహ్రాబానో నఖ్వీ తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని అక్కడ ఉన్నవారిని సైదా షెహ్రాబానో నఖ్వీ అభ్యర్థించారు. ఆ మహిళ తన భర్తతో కలిసి షాపింగ్‌కు వెళ్లిందని.. అక్కడ డిజైన్ బాగుందని ఒక కుర్తా కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే దానిపై ఏం ఉంది అనేది, అది ఏ భాష అని కూడా ఆమెకు తెలియదని సైదా షెహ్రాబానో నఖ్వీ వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మత పెద్దలను పిలిపించి ఆ మహిళ వేసుకున్న డ్రెస్‌పై ఉన్న అక్షరాలకు అర్థం ఏంటో తెలుసుకున్నారు. అయితే ఆ డ్రెస్‌పై ఉంది ఖురాన్ కాదని.. అరబిక్ లాంగ్వేజ్ అని తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.