భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. రైల్వే శాఖ నుంచి ఏ చిన్న నోటిఫికేషన్ విడుదలైనా.. లక్షలాది మంది వాటికి అప్లై చేసుకుంటూ ఉంటారు. రైల్వే ఉద్యోగాలు అంటే మన దేశంలో ఉండే డిమాండ్ వేరు. కొంతమంది రైల్వేలో జాబ్‌లు కొట్టాలని ఏళ్లకేళ్లు పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి నిరుద్యోగ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసం చేస్తూ ఉంటారు. ఇదే అదనుగా రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలకు లక్షలు వసూలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కాస్త కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో స్పందించింది. అలాంటి నోటిఫికేషన్ ఏదీ విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో-పీఐబీ క్లారిటీ ఇచ్చింది.
రైల్వే శాఖలో 4660 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయిందంటూ చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన ఫేక్ అని స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్లు-ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆ ఫేక్ ప్రకటనలో ఉంది. ఏప్రిల్ 15 వ తేదీ నుంచి మే 14 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది.
అలాంటి ఉద్యోగ ప్రకటన గానీ, నోటీసు గానీ దేనిని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని నమ్మి అప్లై చేయవద్దని సూచించింది. ఈ ప్రకటనలతో ఏవైనా వెబ్‌సైట్ లింక్‌లు వస్తే వాటిని ఓపెన్ చేసి వ్యక్తిగత, బ్యాంకు సంబంధిత వివరాలను ఎంటర్ చేయకూడదని హితవు పలికింది. ఆర్‌పీఎఫ్‌లో 452 ఎస్సై.. 4208 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడినట్లు వచ్చిన ప్రకటన అంతా బూటకమని కొట్టిపారేసింది. ఉద్యోగాల సంఖ్య, వేతనం, వయో పరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం వంటి అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలను నమ్మకూడదని.. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే చూడాలని సూచించింది.