దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జంతారా-కర్మతాండ్ మార్గంలోని కల్ఘరియా సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘోర కలిలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొందరు వ్యక్తులు పట్టాల దాటుతుండగా.. అప్పుడే దూసుకువచ్చిన బంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. వారి మీది నుంచి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా రైలు ఢీకొనడంతో అక్కడ ఉన్న వారు ఎగిరిపడ్డారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే రైల్వే అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లు రప్పించి దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు పంపిస్తున్నారు.
చనిపోయిన వారి మృతదేహాలను సేకరించి మార్చురీలకు పంపిస్తున్నారు. అయితే ప్రమాదం సాయంత్రం కాగా.. అక్కడికి రెస్క్యూ బృందాలు వెళ్లేసరికి చీకటి కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. దీంతో మృతదేహాలు, గాయపడిన వారిని వెలికి తీసేందుకు సమయం పడుతోంది.