ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఫైలేరియా రాకుండా ఉండేందుకు ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు యాంటీ ఫైలేరియా మందులు ఇచ్చారు. అయితే అవే వారిని ఆస్పత్రిలో పడేసేలా చేశాయి. యాంటీ ఫైలేరియా మందులు తీసుకున్న చిన్నారుల్లో 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కీళ్ల నొప్పులతో పదుల సంఖ్యలో ఇబ్బంది పడుతూ టీచర్లకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స జరుగుతోందని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అమేథీలోని ఉద్వాలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం కొందరు ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. అక్కడ ఉన్న విద్యార్థులకు యాంటీ ఫైలేరియా మందులు, నులి పురుగుల నివారణ మాత్రలు ఇచ్చారు. అయితే ఆ మందులు తీసుకున్న విద్యార్థులు అప్పుడు బాగానే ఉన్నారు. అయితే ఇంటికి వెళ్లి బుధవారం మళ్లీ తిరిగి స్కూలుకు వచ్చారు. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగింది. పాఠశాలలోని కొందరు విద్యార్థులు జ్వరం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నాయని టీచర్లు, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదులు చేశారు.
పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అప్రమత్తమైన స్కూలు యాజమాన్యం.. వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఫుర్సత్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారికి ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ప్రిన్సిపల్ గిరీష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 28 చిన్నారుల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. యాంటీ ఫైలేరియా, నులి పురుగుల నివారణ మాత్రలు తీసుకుంటే జ్వరం, కీళ్ల నొప్పులు, ముఖం వాపులు వంటి లక్షణాలు ఉంటాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్షుమాన్ సింగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరి పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా చిన్నారులకు మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉదయం కొంతమంది పిల్లలకు జ్వరం, మరికొందరికి మోకాళ్లు, కాళ్లలో నొప్పి వచ్చినట్లు సమాచారం అందిందని కుమార్ తెలిపారు. దీంతో వెంటనే ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తమై పిల్లలందరినీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. చిన్న పిల్లలు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రులకు తరలివచ్చి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకున్నారు.