దేశాన్ని పదేళ్లుగా బీజేపీ పాలిస్తోంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉన్నా 2014, 2019 ఎన్నికల తర్వాత మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ రాజ్యసభలో ఇప్పటికీ పూర్తి స్థాయి బలం లేదు. ఏదైనా చట్టం ఆమోదం పొందాలంటే బీజేపీ, ఎన్డీఏ పార్టీలే కాకుండా ఎన్డీఏ కూటమి బయటి పార్టీ సభ్యులు కూడా మద్దతు తెలిపితేనే జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ భారీగా రాజ్యసభ స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజ్యసభలో ఏ పార్టీకి ఎంత మద్దతు ఉంది.
క్రాస్ ఓటింగ్, ఇండిపెండెంట్‌ల మద్దతు, ఆయా రాష్ట్రాల్లో సంచలన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తం ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 41 సీట్లు ఏకగ్రీవం కాగా.. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 15 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఏకగ్రీవం అయిన 41 స్థానాల్లో 30 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇక 15 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 3, సమాజ్‌వాదీ పార్టీ 2 సీట్లు సాధించాయి. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ వేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీజేపీ నేతలు ఓటు వేయడం సంచలనంగా మారింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల్చే స్థాయికి చేరుకున్నాయి.
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. మెజారిటీ దక్కించుకోవాలంటే 121 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాలను చూస్తే 97 మంది సభ్యులు బీజేపీకి ఉన్నారు. ఇక ఎన్డీఏ పార్టీలతో కలిపి 117 ఎంపీల సంఖ్యా బలం ఉంది. పెద్దల సభలో మెజారిటీ 121 మంది సభ్యులు అవసరం కాగా ఎన్డీఏకు 117 మంది ఉండగా.. మెజారిటీకి నలుగురు సభ్యులు మాత్రమే తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలోనే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 29, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13 మంది, డీఎంకే 10, ఆమ్ ఆద్మీ పార్టీలకు 10 మంది, బీజేడీ 9, వైఎస్ఆర్సీపీ 9, బీఆర్ఎస్ 7, ఆర్జేడీ 6, సీపీఎం 5, ఏఐడీఎంకే 1, జేడీయూకు ఒక చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
మంగళవారం ఎన్నికలు జరిగిన 56 సీట్లలో 41 ఏకగ్రీవం కాగా.. 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 56 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ 30 స్థానాలను దక్కించుకుంది. అయితే ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో భాగంగా.. కర్ణాటకలో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అటు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 సీట్లను బీజేపీ గెలుచుకోగా.. రెండింటిని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది. నిజానికి ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 7 స్థానాలు గెలుచుకునే బలం మాత్రమే ఉండగా.. ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో మరో స్థానాన్ని దక్కించుకుంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ఏకైక స్థానాన్ని బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి ఓటేయడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.