ఇటీవలి కాలంలో రూ. 500 కరెన్సీ నోటుకు సంబంధించి ఫేక్ నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాల్లో వార్తలు, సందేశాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే నకిలీ నోట్లు ఉన్నప్పటికీ.. వాస్తవంగా ఇది ఎంత శాతం అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఎక్కడో చోట ఇలాంటి నోట్లు మన కరెన్సీలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి సోషల్ మీడియాలో వార్తలు చూసి మనం వదిలేయాల్సిన పని లేదు. అసలు మన దగ్గర ఉన్న రూ. 500 నోటు నిజమైనదేనా? రియల్ రూ. 500 నోటును అసలు ఎలా గుర్తించాలి. ఎలాంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలా ఫేక్ కరెన్సీ నోట్ స్కామ్ బారిన పడకుండా ఉండొచ్చు.
రూ. 500 రియల్ నోట్‌ను గుర్తించేందుకు ఎలాంటి ఫీచర్లు ఉంటాయో తెలుపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్‌బీఐ కెహ్తా హై వెబ్‌సైట్‌లో వివరించింది. ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి Know Your Bank Notes పై క్లిక్ చేస్తే అక్కడ రూ. 100, రూ. 200, రూ. 500 ఇలా కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేస్తే పూర్తి ఫీచర్లు తెలుసుకోవచ్చు.
కొన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా రూ. 500 నోటు అసలుదో, నకిలీదో అని తెలుసుకోవచ్చు. ముందుగా సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటులోని ఒక నిలువు గీత. ఇది ముందుగా మనకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అదే నోటు వంచి చూస్తే అప్పుడు థిక్ బ్లూ (ముదురు నీలం) రంగులోకి మారుతుంది. గీత రంగు మారితేనే ఒరిజినల్. లేకపోతే అది ఫేక్ అని తెలుసుకోవాలి.
>> అదే కరెన్సీ నోటు కుడి, ఎడమ వైపు ఖాళీ ప్లేసులో కాస్త వెలుతురులో ఉంచి నోటును చూస్తే జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో, అంకెలతో నోటు విలువ సంఖ్య వాటర్ మార్క్ ఉంటుంది. ఇంకా కరెన్సీ నోటుపై చిన్న సైజ్‌లో ఇంగ్లీష్, హిందీ భాషలో అక్షరాలుంటాయి. కరెన్సీ నోటును సాధారణ పేపర్‌తో తయారు చేయరు. ఈ నోటు కాస్త తడిచినా కూడా మామూలు పేపర్ మాదిరిగా చిరిగిపోదు.
ఇంకా కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ చిత్రం ఉన్న వైపు.. ఎడమ, కుడి చివర్లలో క్రాస్‌గా 5 చిన్న గీతలుంటాయి. దీనిని వేళ్లతో తడిమితే ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఇది కంటిచూపు లేని వారికి కూడా తెలుస్తుంది. నోటుపై రూ. 500 నంబర్ దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది. కుడివైపున వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా చిత్రం కనిపిస్తుంది. ఇంకా అశోక చిహ్నం ఉంటుంది. నోటు వెనుక భాగాన స్వచ్ఛ్ భారత్ లోగా, నినాదం, లాంగ్వేజ్ ప్యానెల్ గమనించొచ్చు. రెడ్ ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనించడం ద్వారా నకిలీ రూ. 500 నోటు ఈజీగా గుర్తించొచ్చు.
2016 నవంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అప్పుడు పెద్ద నోట్లుగా ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి రూ. 2 వేలు విలువైన నోటు తీసుకొచ్చింది. తర్వాత పాత రూ. 500 నోటు మాదిరిగా కాకుండా కొత్త డిజైన్‌లో రూ. 500 నోటు తెచ్చింది. ఇక గతేడాది రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త డిజైన్లోని రూ. 500 నోటు పెద్ద కరెన్సీగా ఉంది. గత 5 సంవత్సరాలలో రూ. 500 కరెన్సీలో నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 317 శాతం పెరిగినట్లు కొద్ది రోజుల కిందట ఆర్థిక మంత్రిత్వ శాఖ.. పార్లమెంటులో రిపోర్ట్ ఇచ్చింది.