ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా, కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్ర యూనివర్సిటీకి దశాబ్దాల ఘన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీని ప్రపంచంలోనే మేటి విద్యాసంస్థగా 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'గా తీర్చిదిద్దేందుకు ఈ శతాబ్ది ఉత్సవాలు ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములను చేయాలని సూచించారు. వారి అనుభవాలు, విజయాలు ప్రస్తుత తరానికి స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.శతాబ్ది ఉత్సవాల్లో ఏయూ ఘన చరిత్ర ప్రతిబింబించేలా అన్ని చర్యలు తీసుకోవాలని, దీనికోసం నియమించిన వివిధ కమిటీల మధ్య సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. మీడియా పబ్లిసిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్నంగా రూపొందించాలని చెప్పారు. ఈ ప్రక్రియలో విద్యార్థుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేవలం యూనివర్సిటీకే పరిమితం కాకుండా, ఉత్తరాంధ్ర ప్రజలను, విద్యార్థులను కూడా ఈ వేడుకల్లో భాగస్వాములను చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖలతో వివిధ అంశాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించడంతో పాటు, యూనివర్సిటీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాబోయే వందేళ్ల విజన్‌కు తగిన 'యాక్షన్ ప్లాన్'ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.సమీక్షలో భాగంగా వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వర్సిటీలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఏప్రిల్ 26న జరిగే శతాబ్ది స్థాపన దినోత్సవ అజెండాను మంత్రికి వివరించారు. అనుబంధ కళాశాలలను కూడా ఉత్సవాల్లో కలుపుకుని వెళతామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉత్సవాల్లో భాగం చేయాలని, దీనిద్వారా విశ్వవిద్యాలయానికి మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ఒక అద్భుత అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు , విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa