బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బొలీవియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C-130 హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం (ఫిబ్రవరి 27) రాత్రి ఎల్ ఆల్టో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కూప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు.
బొలీవియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ కేంద్ర బ్యాంకుకు చెందిన కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న హెర్క్యులస్ విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎల్ ఆల్టో ఎయిర్‌పోర్టు సమీపంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారిపై కుప్పకూలింది. రద్దీగా ఉండే కోస్టనెరా అవెన్యూ రహదారిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. విమానం రెక్కలు పూర్తిగా విరిగిపోయి తీవ్రంగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భయంతో జనం పరుగులు తీశారు.
విమానం కూలిన సమయంలో అందులోని కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడపోయాయి. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. కొందరు వ్యక్తులు నేలపై పడిన నోట్లను ఏరుకోవడానికి ప్రయత్నించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో.. ప్రజల్ని నియంత్రించేందుకు పోలీసులు వాటర్ హోస్‌లు, టియర్ గ్యాస్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇక చనిపోయిన వారిలో విమాన సిబ్బందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని సమీపంలోని డెల్ నార్టే హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానం ప్రమాదం నేపథ్యంలో ప్రస్తుతం ఎల్ ఆల్టో ఎయిర్‌పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం అనుకూలించలేదని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై బొలీవియా రక్షణ మంత్రిత్వ శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa