ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా జరిపిన దాడుల్లో ప్రాణనష్టంపై తొలి నివేదిక వచ్చింది. మినాబ్‌లోని బాలిక స్కూల్‌పై జరిపిన దాడిలో 36 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మినాబ్‌లో ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ స్థావరం ఉండటంతో దానిపై దాడి జరిగింది. దీనికి సమీపంలోనే బాలికల పాఠశాల ఉండటం వల్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రభావితమైంది. ఇప్పటి వరకు 36 మంది పిల్లలు బలికాగా.. డజన్ల కొద్దీ గాయపడినట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మీ విధిని మీరే నిర్దేశించుకోవాలని, 1979 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఇస్లామిక్ నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చారు.
స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో మొదటి దాడులు జరిగాయి. ఆ తర్వాతే ఇరాన్ వ్యాప్తంగా దాడులు జరిగినట్టు ఆ దేశ మీడియా నివేదించింది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ‘ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమ విధిని తమ చేతుల్లోకి తీసుకునేందుకు మా సంయుక్త ఆపరేషన్ అనువైన పరిస్థితులను సృష్టిస్తుంది’ అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో ప్రతిష్టంభనతో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా తన యుద్ధ నౌకలను పశ్చిమాసియా దిశగా తరలించింది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు నిర్వహించింది.
ఈ దాడులకు ఇరాన్ కూడా ధీటుగానే ప్రతిస్పందించింది. తమ దేశంపై దాడిచేస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను చట్టబద్దమైన లక్ష్యాలుగా చేసుకుంటామని ఇంతకు ముందే ఇరాన్ హెచ్చరించింది. ముందునుంచి చెప్పినట్టుగానే బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ, సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి.
ఒక ప్రకటన విడుదల చేసిన ఇరాన్.. ప్రతిస్పందనకు తాము వెనుకాడబోమని తేల్చిచెప్పింది. ఎక్స్‌లో (ట్విట్టర్)లో ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన ఒక ప్రకటనలో, ‘మాతృభూమిని రక్షించుకోవడానికి, శత్రువు సైనిక దాడిని ఎదుర్కోవడానికి సమయం ఆసన్నమైంది’ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa