ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ పేలుడు ఘటన,,, ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలు ఇవే...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 07:55 PM

ఛిద్రమైన శరీర భాగాలు.. ముక్కలు ముక్కలుగా తెగిపడి, పంటపొలాల్లో చెల్లాచెదురుగా విసిరివేయబడిన మృతదేహాలు.. ఏ భాగం ఎవరిదో తెలియదు.. మిన్నంటిన ఆక్రందనలు.. తమ వారి కోసం కుటుంబసభ్యుల గాలింపులు.. మొత్తంగా భీతావహ వాతావరణం.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన.. తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ప్రమాదం.. రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడులో 21 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. అయితే ఇంతమంది చనిపోవటానికి.. ప్రమాద తీవ్రత ఇంతగా పెరడానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.


ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలు


ప్రమాద తీవ్రత పెరడానికి అతి భారీ పేలుడు ఒక కారణమైతే.. రెండు గంటల పాటూ పేలుళ్లు కొనసాగడం మరో కారణం. దీంతో స్థానికులు, చుట్టుపక్కల జనం ఎవరూ కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లలేకపోయారు. చివరకు కొంతమంది ధైర్యం చేసి వెళ్లేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది మంటల్లో సజీవదహనమయ్యారు. ముక్కలు ముక్కలుగా శరీరభాగాలు తెగిపడిపోయాయి. దీనికి తోడు ప్రమాదం జరిగిన సూర్య శ్రీ ఫైర్ వర్క్స్.. వరిపొలాల మధ్యలో ఉంది. దీంతో ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్, ఫైరింజన్లు వెళ్లడానికి సరైన మార్గం లేకపోయింది. పొలాలు అన్నీ బురదమయంగా ఉండటం కూడా ఆలస్యానికి కారణమైంది.


పరారీలో యజమాని..


సహాయక చర్యలకు అనుకూలించని ఇలాంటి పరిస్థితులలో అతి కష్టమ్మీద అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక పేలుడు ఘటన తర్వాత సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని పరారైనట్లు అధికారులు వెల్లడించారు. పొలాల్లో షెడ్లు వేసి బాణసంచా తయారుచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.


వేట్లపాలెం పేలుడు.. చనిపోయినవారి వివరాలు


మరోవైపు ప్రమాదంలో చనిపోయినవారిలో ఇప్పటి వరకూ 13 మందిని గుర్తించారు. కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, అడబాల శ్రీను, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, నిమ్మద కరుణ, మందపల్లి చిన్ని, గంపల మంగ,గొడతా రాము, గొడతా నాని, గొడతా మహేశ్‌ మృతదేహాలను ఇప్పటి వరకూ గుర్తించారు. పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa