ఇరాన్‌లో భారీ యుద్ధ పోరాటాన్ని అమెరికా దళాలు ప్రారంభించినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ధ్రువీకరించారు. ఆయుధాలు విడిచిపెట్టడమా లేదా చావడమా? ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలని ఇరాన్ సైన్యాన్ని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ముందస్తు ముప్పును నివారించడానికే ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెలివిజన్‌లో ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్ నుంచి రాబోయే ముప్పునకు ప్రత్యక్ష ప్రతిస్పందగా దాడులను అభివర్ణించారు.
‘‘కొద్దిసేపటి కిందటే ఇరాన్‌లో అమెరికా సైన్యం భారీ యుద్ధ పోరాటాన్ని మొదలుపెట్టింది.. అతిభయంకరమైన ఇరాన్ దుర్మార్గపు పాలన నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి అమెరికా పౌరులను రక్షించుకోవడమే తమ ప్రధాన లక్ష్యం..’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అమెరికా ప్రయోజనాలు, వ్యక్తులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా ఇరాన్ ప్రచారం నిర్వహిస్తోందని, ఇకపై దానిని తాము సహించబోమని ట్రంప్ తేల్చిచెప్పారు. ‘‘ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్, సాయుధ దళాలు, ఇతర పోలీస్ విభాగాల సిబ్బందికి ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే.. మీరు ఆయుధాలు పక్కన పడేసి ప్రాణాలు దక్కించుకుంటారా లేదా దీనికి ప్రత్యామ్నాయంగా చావును కోరుకుంటారా? ఏదో ఒకటి నిర్ణయించుకోండి’’ అని ట్రంప్ అల్టిమేటమ్ జారీచేశారు.
క్షిపణి పరిశ్రమను ధ్వంసం చేస్తాం
‘‘ఇరాన్ క్షిపణలు, క్షేత్రస్థాయిలో క్షిపణి పరిశ్రమలను నిర్వీర్యం చేస్తాం.. పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. వారి నావికాదళాన్ని నాశనం చేయబోతున్నాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. ఈ పోరాటంలో అమెరికా సైన్యంలో ప్రాణనష్టం అవకాశాలను కూడా ట్రంప్ ధ్రువీకరించారు. ‘‘ధైర్యవంతులైన అమెరికా హీరోలను కోల్పోవచ్చు.. మావైపు కూడా ప్రాణనష్టం ఉంటుంది.. యుద్ధంలో ఇది తరచుగా జరుగుతుంది. కానీ మనం దీన్ని ఇప్పటి కోసం కాదు భవిష్యత్తు కోసం మనం చేస్తున్నాం.. ఇది ఒక గొప్ప లక్ష్యం’’ అని ట్రంప్ అన్నారు.
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను సమకూర్చోరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘ఇది నిరంతరం అమెరికా విధానం ముఖ్యంగా నా పాలనలో ఉగ్రవాద ప్రభుత్వం అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు.. ఇది మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ’’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి, మీ స్వేచ్ఛకు సమయం వచ్చిందని అన్నారు. బయట పరిస్తితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఇళ్ల నుంచి రావద్దని ట్రంప్ సూచించారు. మా పని పూర్తయిన తర్వాత మీ ప్రభుత్వం మీదే అవుతుంది అని ట్రంప్ ఉద్ఘాటించారు.
టెహ్రాన్, ఇస్ఫాహాన్, కరాజ్, కెర్మాషా సహా ఇరాన్‌లోని పలు నగరాలపై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన నాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa