ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్‌పై ప్రతీకారం.. ఏకకాలంలో 8 దేశాలపై క్షిపణులతో ఇరాన్ దాడి

international |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 07:39 PM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ దాడితో రగిలిపోయిన ఇరాన్.. ప్రతీకార దాడులు చేపట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా నౌకా, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్ సహా ఏనిమిది దేశాలపై ఏకకాలంలో ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్టీట్‌‌పై మిస్సైల్ దాడితో ఎమర్జెన్సీ సైరెన్లు మోగించారు. భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు తెలిపారు. అలాగే, ప్రజల మొబైల్ ఫోన్లకు అంతర్జగత వ్యవహారాల శాఖ నుంచి భధ్రతా సందేశాలు వచ్చాయి. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ రాజధాని అబుదాబిలోనూ పేలుళ్లు చోటుచేసుకున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.


మరోవైపు, రెండు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ఖతార్ కూల్చివేసినట్టు నివేదికలు తెలిపాయి. అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడిచేసినప్పటికీ అక్కడ అమెరికాకు చెందిన ఎటువంటి సామాగ్రి లేదు. ఇజ్రాయెల్‌ కూడా తమపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్టు ధ్రువీకరించింది. ‘‘గగనతల రక్షణ వ్యవస్థ ప్రస్తుతం క్షిపణులను గుర్తించి అడ్డుకుంటోంది... ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లు మోగించాం.. ఈ సమయంలో, ముప్పును నివారించడానికి ఐఏఎఫ్ పనిచేస్తోంది’ అని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన చేసింది. అయితే, తదుపరి ప్రకటన వచ్చే వరకూ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.


 ఇదిలా ఉండగా, ఇరాన్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ముందుజాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్ సైతం గగనతాలన్ని మూసివేసి, సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. టెహ్రాన్‌లోని ఖమేనీ కార్యాయానికి సమీపంలోనే దాడి జరగడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడకుండా ఇరాన్ అప్రమత్తమైంది. అటు ఇంటర్నెట్ సేవలను కూడా ఇరాన్ నిలిపివేసింది. ప్రతీకార దాడులపై ప్రకటన చేసిన ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్.. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణుల ప్రయోగించామని తెలిపింది.


ఇరాన్ దాడులను అడ్డుకోడానికి ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తుందని ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెహ్రాన్ క్షిపణుల వర్షం కురిపించింది. మరోవైపు, ఇరాన్ సైనికులను ఆయుధాలు వదిలేయాలని ట్రంప్ హెచ్చరించారు. లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని ఆయన బెదిరింపులకు దిగారు. ఇక, యుద్ధం ఇజ్రాయెల్ మొదలుపెట్టిందని, తాము ముగిస్తామని ఇరాన్ శపథం చేసింది. దీంతో పరిస్థితులు మరింత వేడెక్కి పూర్తిస్థాయి పోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa