ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతాలో భూప్రకంపనలు.. ఆఫీసులను ఖాళీ చేయించిన అధికారులు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 07:31 PM

కోల్‌కతాలో శుక్రవారం భారీ భూప్రకంపనలు వణికించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జనం ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. తొలుత బంగ్లాదేశ్‌లో భూకంపం చోటుచేసుకోగా.. కోల్‌కతా నగరంలోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు సహా భవనాల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల వెలుపల గుమిగూడారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కార్యాలయాల నుంచి ఉద్యోగులను అధికారులు బయటకు పంపారు.


కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఓ సభలో ప్రసంగిస్తుండగా భూప్రకంపనలతో కాసేపు ఆగిపోయారు. ఓ 63 ఏళ్ల మహిళ తాను కుర్చీపై కూర్చుని ఉండగా దానంతట అదే ఊగిందని, స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఫ్యాన్ కూడా కదిలిందని ఆమె చెప్పారు. ఇది ఐదు నిమిషాల పాటు కొనసాగిందని ఆమె పేర్కొంది. అయితే, భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. భూకంపం ఆగిపోయిన తర్వాత వస్తువులు వాటంతట అవే వేగంతో కదులుతుండటం ఆమె చూసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని అగర్గావ్‌లోని బీఎండీ సీస్మిక్ సెంటర్.. దేశ నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. ప్రాణ, ఆస్తి నష్టం సహా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భూకంపం వచ్చింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు నైరుతిగా 191 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు భారత జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్‌లో నయాబజార్ వద్ద భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు పేర్కొంది. ఇది కోల్‌కతా నగరానికి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. అందువల్లే కోల్‌కతా నగరంలో భూప్రకంపనల తీవ్ర అధికంగా ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa