పండుగ వేళ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేస్తున్నామని నేడు ప్రకటించారు. రూ.6,700 కోట్ల మేర బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా నేడు ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, ఆయా వర్గాలకు మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు. "బకాయిలకు సంబంధించిన నిధుల విడుదలపై నేడు తీసుకున్న నిర్ణయం లక్షల మంది ఇళ్లలో సంతోషాన్ని తెస్తుంది. పండుగ వేళ వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తాం... ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తాం... అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.