టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సలహాలు తీసుకోడనే వాదన సరికాదని మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. కోహ్లీపై ఇది తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీకి సూచనలు ఇస్తే తప్పకుండా ఆచరిస్తాడని, ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పమని కోరుతాడని కూడా వెల్లడించాడు. పట్టించుకోకపోవడమనేదే ఉండదని వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 5 టెస్ట్‌ల్లో 190 పరుగులే చేశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 8సార్లు ఔటైన కోహ్లీ.. ఈ ఎనిమిది సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కే వెనుదిరిగాడు. శరీరానికి దూరంగా వచ్చిన బంతులను వదిలేయాని సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు చెప్పినా కోహ్లీ వినిపించుకోలేదు. దీంతో సలహాలు తీసుకునేందుకు కోహ్లీ సిద్ధంగా ఉండడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ వాదనపై భరత్ అరుణ్ స్పందించాడు. 'బ్యాటింగ్‌లో ఎవరైన మార్పులు చేసుకోవాలని చెబితే తప్పకుండా తప్పిదం ఏంటని కోహ్లీ అడుగుతాడు. అప్పుడు మనం చెప్పిన కారణాలు సరిగ్గా అనిపిస్తే వాటిని పాటిస్తాడు. ఇలా చేయబట్టే అతను ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. కోచ్‌ల నుంచి ప్రతి సూచినను కోహ్లీ పాటిస్తాడు. అందుకు తగినట్లుగా తన ఆటలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. మైదానంలోకి దిగాక పరిస్థితులు భిన్నంగా అనిపిస్తాయి.'అని భరత్ అరుణ్ తెలిపాడు.