ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీంట్లో కనీసం రూ. 500 తో సిప్ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ రూ. 500 అంటే చాలా మందికి, చిన్న చిన్న పనులు చేసుకునే వారికి కష్టంగానే ఉంటుంది. అందుకే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను మరింత ప్రోత్సహించేందుకు.. సామాన్య ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు సెబీ చీఫ్ మాధవి పురి చెప్పారు. ఇందుకోసం త్వరలోనే రూ. 250 సిప్ చేసే వీలు కలుగుతుందని .. వీలైనంత త్వరలోనే దీనిని తీసుకొస్తామని ఆమె గతంలో చెప్పగా మరోసారి పునరుద్ఘాటించారు. అతిత్వరలోనే రూ. 250 సిప్ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. తక్కువ సిప్‌తో కూడా లాంగ్ రన్‌లో ఎక్కువ రాబడి అందుకునే అవకాశం ఉంటుంది.
ఇంకా చిన్న, మధ్య స్థాయి కంపెనీల బోర్డు ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చే సమయం తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు మాధవి పురి. ఎస్ఎంఈ ఇష్యూలకు అనుమతులు ఇచ్చేందుకు సెబీకి 3 నెలల సమయం పడుతుందని.. టెక్ టూల్స్‌ను మరింత వినియోగించి సమయం తగ్గిస్తామని శుక్రవారం రోజు సెబీకి చెందిన ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో ఆమె వెల్లడించారు. మరోవైపు మ్యూచువల్ ఫండ్ సంస్థల కొత్త ఆఫర్లకు కూడా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్స్ రూ. 14.27 లక్షల కోట్ల మేర సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ .11.8 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9 నెలల్లో మొత్తం మీద రూ. 10.7 లక్షల కోట్ల వరకు సంస్థలు సమీకరించాయని.. జనవరి- మార్చితో కలిపి రూ. 14.27 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారామె.
ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనీసం రూ. 500 సిప్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇలా పెట్టుబడులు పెట్టినా కూడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంటుంది.