ట్రెండింగ్
Epaper    English    தமிழ்

LPG సరఫరాలో బిగ్ బూస్ట్: హార్మూజ్ దాటిన భారత నౌక కీలక ప్రయాణం పూర్తి

national |  Suryaa Desk  | Published : Sat, May 02, 2026, 10:09 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పైనా పడుతూ, ఇంధన సరఫరాలో అంతరాయం కలిగించి వినియోగదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది.యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఆ ప్రాంతంపై అమెరికా నియంత్రణ, ఆంక్షలు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో భారత్‌కు కొంత ఊరట కలిగించే వార్త వెలువడింది.భారతానికి చెందిన ‘సర్వ్ శక్తి’ నౌక తాజాగా హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటినట్లు సమాచారం. ఈ నౌకలో సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు ఉండగా, ఇందులో భారత నావికా సిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ‘ఇండియా క్రూ’ అనే సందేశాన్ని పంపించింది.ప్రస్తుతం ఈ నౌక లారక్ ఐలాండ్‌ను దాటి ఒమన్ గల్ఫ్ వైపు ప్రయాణిస్తోంది. ఇరాన్ సూచించిన సురక్షిత మార్గాన్ని అనుసరించి నౌక ముందుకు సాగుతోందని సమాచారం. ఇందులో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో 18 మంది భారతీయులే కావడం గమనార్హం.ఈ నౌకలో 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మే 13 నాటికి విశాఖపట్నం తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఈ సరుకును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.ప్రస్తుత గ్యాస్ సంక్షోభ పరిస్థితుల్లో ఈ నౌక భారత్‌కు చేరుకోవడం ఎల్పీజీ సరఫరాకు కొంత మేర ఉపశమనం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa