ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ వచ్చాక పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 02:07 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీజేపీ నాయకుడేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని అందరూ బీజేపీకి ‘బీ’ టీంగా చిత్రిస్తున్నారని.. కానీ బీజేపీలోనే వైసీపీ ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన చోటే.. శుక్రవారం ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడలో పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. హోదా సాధించకపోవడం వల్ల రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి పోయిందన్నారు. ఉద్యోగాల భర్తీ ఇదే తరహాలో కొనసాగితే.. రాష్ట్రంలో యువత కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని.. ఇది రాష్ట్రానికి సంజీవని వంటిదని చెప్పారు. రాజకీయం కోసం ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ దీనిని వాడుకున్నారని, దీక్షలు కూడా చేశారని.. మూకుమ్మడిగా లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఎందుకివ్వదంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క ఎంపీతోనైనా రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజా హక్కు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. ‘2014లో ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? హోదా ఇచ్చాక ఉత్తరాఖండ్‌లో 2,000 పరిశ్రమలు వచ్చాయి. ఇక్కడ జగన్‌ వచ్చాక పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా? రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. వాటి ఆధారిత పరిశ్రమలు వచ్చాయా? రాష్ట్రాన్ని హార్డ్‌వేర్‌ హబ్‌ చేస్తానంటూ మోదీ చేసిన ప్రకటన ఏమైంది’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. జగన్‌ పాలనలో లిక్కర్‌, శాండ్‌, మైనింగ్‌ మాఫియా పేట్రేగిపోతున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. మాఫియా గురించి కేంద్రంలోని వారందరికీ తెలుసని.. కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదో అందరికీ అర్థమవుతోందన్నారు. జగన్‌ బీజేపీ నాయకుడు కాబట్టే ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com