ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ నేత సత్యకుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేల్చక పోగా వ్యవస్థలోఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దర్యాప్తు సంస్థల విచారణను కూడా అడ్డుకుని నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. అందుకే బాబాయి కూతురే (సునీత రెడ్డి) తన అన్న పార్టీకి ఓటేయవద్దని, ప్రజాకోర్టే తన తండ్రి మరణంపై తీర్పు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ‘‘ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలు తప్పవని మీ చెల్లే చెబుతున్నారంటే.. ఇక మీరు ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు జగన్. మీ “పాత్ర”పై కూడా విచారణ చేయాలని ఆమె అడుగుతున్నారంటే.. మీ కుటుంబంలో మీపై ఉన్న నమ్మకం, మీకున్న విలువ ఎంతో అందరికీ అర్థమవుతోంది’’ అంటూ సత్యకుమార్ ట్వీట్ చేశారు.