మన దేశ రైల్వే నెట్‌వర్క్ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగా సరకులు సరఫరా అయ్యేందుకు భారతీయ రైల్వేలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ భారతీయ రైల్వేలు కావడం విశేషం. లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు.. రైల్వేలో పనిచేస్తున్నారు. అయితే తాజాగా వారు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా హెచ్చరికలు చేశారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని లేకపోతే మే 1 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైలు సర్వీసులు ఆపివేస్తామని సంచలన ప్రకటన చేశాయి.
ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని.. రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఒక వేళ తమ డిమాండ్‌ను కేంద్రం నెరవేర్చకపోతే మే 1 వ తేదీ నుంచి దేశం అంతటా అన్ని రైళ్ల సేవలను నిలిపివేస్తామని తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే ఇటీవల పలు రైల్వే సంఘాలు జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ పాత పెన్షన్ స్కీమ్ పేరిట ఒక చోటుకు చేరాయి. తాజా సమావేశమైన కోర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని తాము చేస్తున్న తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. అందుకే ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పడం లేదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయిన మే 1 వ తేదీ నుంచి పాత పెన్షన్ విధానం కోసం నిరవధిక సమ్మెను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును పంచుకున్నారు.
ఇక ఈ నెల 19 వ తేదీన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు జాయింట్ ఫోరం కన్వీనర్ వెల్లడించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కానున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ గోపాల్ మిశ్రా వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేలో సమ్మె అనడంతో ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు.