ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో మరోసారి ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. రెండు విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. వామపక్ష, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య గురువారం అర్ధరాత్రి మొదలైన వాగ్వాదం చివరకూ భీకర గొడవకు దారితీసింది. దీంతో రెండు విద్యార్థి గ్రూపులు తన్నుకున్నాయి. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పార్కింగ్ ఏరియాలో వంద మంది విద్యార్థులు గుమిగూడి ఘర్షణకు దిగడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కిక్‌లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఓ విద్యార్థికి తలపగిలి రక్తమోడుతోంది. భుజంపై సైకిల్ తగిలించుకుని ఓ విద్యార్థి దాడి చేస్తున్న దృశ్యం కూడా వీడియోలో రికార్డయ్యింది. చాలా మంది కర్రలతో కొట్టుకుంటుంగా.. అనంతరం అక్కడ తొక్కిసలాట జరిగింది. త్వరలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనుండగా.. దీనికి ముందే రెండు గ్రూపులు పరస్పరం ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. అటు, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఎవరూ కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద జరిగిన ఈ గొడవకు కారణం ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక అంశమేనని తెలుస్తోంది.
వామపక్ష అనుబంధ సంఘం డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ లు మాత్రం ABVP సభ్యులు తమ సమావేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించాయి. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులను బెదిరించడంతో పాటు కులపరమైన, లైంగిక దూషణలకు దిగారని పేర్కొ్నారు.
‘ఏబీవీపీ గూండాల విధ్వంసం.. హింసాత్మక చర్యను వీసీ కార్యాలయం తప్పనిసరిగా గుర్తించాలి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేరస్థులను తప్పనిసరిగా శిక్షించాలి.. అటువంటి హింసకు పాల్పడిన వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి’ అని AISA ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై దుర్మార్గంగా దాడిచేశారని, దివ్యాంగులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఎస్ఎఫ్ఐ జేఎన్‌యూ ప్రెసిడెంట్ ఐషే ఘోష్ దుయ్యబట్టారు.