గంజాయి తోటల్లో కూలీగా పనిచేసే ఓ మహిళ.. దురాశకు పోయి ఏకంగా స్మగ్లర్ అవతారం ఎత్తింది. సినీ ఫక్కీలో స్కూటీ డిక్కీలో గంజాయి దాచిపెట్టి.. ఒంటరిగా ఒడిశా నుంచి ముంబయికి బయలుదేరింది. చివరకు తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలతో ఆమె బండారం బయటపడింది. నార్కోటిక్ బ్యూరో చేతికి చిక్కి.. కటకటాలపాలైంది. అయితే, అడవుల్లో వందల కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించిన ఆమె ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ సమీపంలో మహారాష్ట్రకు చెందిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెల్తే.. మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు చెందిన మోహిని సంతోష్ ఠాక్రే (33) అనే మహిళ గంజాయి తీసే కూలీగా పనిచేస్తూ స్మగ్లర్‌గా మారింది. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తోంది. ఆ గంజాయిని మహారాష్ట్రకు చెందిన నితిన్ అనే వ్యక్తికి సరఫరా చేసేది. అందుకు తన స్కూటీలో గంజాయిని దాచి కొండలు, అడవుల గుండా ఒంటరిగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేది. ఆమె తెలంగాణ మీదుగా తన దందాను సాగించేంది.
రాష్ట్రం గుండా ముంబయి తదితర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు గత రెండు నెలలుగా మహారాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచారు. గురువారం నాడు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో మోహిని సంతోష్ ఠాక్రేను పోలీసులు పట్టుకున్నారు. స్కూటీ డిక్కీలో 28 కిలోల ప్యాక్ చేసిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ మోహినిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.