బ్రిటన్ రాజ కుటుంబంలో చీమ చిటుక్కమన్నా ప్రపంచానికి వార్తే. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంది. తాజాగా, యువరాణి కేట్ మిడిల్టన్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం గత డిసెంబర్ నుంచి ఆమె బయటకు రాకపోవడమే. ఇటీవల ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న కేట్.. కోమాలోకి వెళ్లిపోయారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. కేట్ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని జనవరి 17న వెల్లడించిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం.. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది.
పొత్తికడుపులో శస్త్రచికిత్స కావడంతో 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. కానీ, అప్పటి నుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం వదంతులకు కారణమైంది. సర్జరీ సమయంలో విలియమ్స్ సతీమణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. తొలుత ఓ స్పానిష్ టీవీ జర్నలిస్టు కొంచా కల్లెజా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనను బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు కొట్టిపారేశాయి.
అదంతా తప్పుడు ప్రచారమేనని చెప్పినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం కేట్ కనిపించకుండా పోయారనే వార్తలు ఆగడం లేదు. ఇటీవల పలు కార్యక్రమాలకు ప్రిన్స్ విలియం ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరోవైపు, బ్రిటన్ రాజు ఛార్లెస్-3 కి కేన్సర్ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవల ప్రకటించింది. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. వేల్స్ యువరాణి కేట్ కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు తెలుస్తోంది.
కేట్ త్వరలోనే ప్రజల ముందుకువస్తారని రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చని బ్రిటన్ మీడియా అంటోంది. ప్రిన్సెస్ కేట్ ప్రతినిధి మాత్రం ఈ ప్రచారాన్ని కుట్రగా అభివర్ణించారు. ‘వేల్స్ యువరాణి ఈస్టర్ తర్వాత, కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాల సమయంలోనే ప్రకటన చేస్తుంది.. మేము మొదటి నుంచి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం’ అని తెలిపారు.