బంగ్లాదేశ్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ మాల్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో కనీనం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం నుంచి మరో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి సమంతా లాల్ సేన్ మాట్లాడుతూ.. గురువారం అర్ధరాత్రి ఢాకా నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్టు తెలిపారు. మాల్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతున్న మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సేన్ వివరించారు. ఘటనా స్థలిలోనే 33 మంది చనిపోయారని, షేక్ హసినా ప్లాస్టిక్ సర్జరీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ మరో పది మంది చనిపోయారన్నారు. ఢాకా నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రముఖ మాల్‌లోని మొదటి అంతస్తు రెస్టారెంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇవి పై అంతస్తులకు వ్యాపించడంతో డజన్లు కొంది జనాలు చిక్కుకున్నారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎగిసిపడుతోన్న మంటల నుంచి తప్పించుకోడానికి జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు పెడుతుండటం కనిపిస్తోంది. అయితే, ఘటనకు కారణం ఏంటో తక్షణమే తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.మాల్‌లో పనిచేసే మహమ్మద్ అల్తాప్ అనే ఉద్యోగి.. వంటగదిలోని కిటీకీ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. కానీ, తన సహచరులు ఇద్దరు మంటల్లో కాలిబూడిదయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. డజన్ల కొద్దీ అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది రక్షించిన 75 మందిలో 42 మంది ప్రస్తుతం స్పృహలో లేరని అధికారులు పేర్కొన్నారు.