ఏపీలో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైనా కొద్దీ.. రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ప్రతిపక్షాల కంటే.. అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందే ఉంటోంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరోవైపు.. సిద్ధం సభలతో.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ జనాల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచేలా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎన్నికలకు అతి కీలకమైన మేనిఫెస్టోను కూడా జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు సమాచారం.
ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించబోయే సిద్ధం సభలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ.. సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించింది. ఈ సభకు గత 3 సభల కంటే ఎక్కువ సంఖ్యలో జనసమీకరణ చేయనున్నట్టు సమాచారం. సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల అంచనా.
మరోవైపు.. మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో.. మార్చి 10న మేనిఫెస్టోను విడుదల చేసి.. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 10 తర్వాత సీఎం జగన్ నియోజకవర్గాల పర్యటన చేయనున్నట్టు విజయసాయి రెడ్డి తెలిపారు. వై నాట్ 175తో పాటు 25 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. గత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. చాలా ఈజీగా ప్రజలకు సులభంగా చేరేలా తయారు చేయటంతో.. వైసీపీ మేనిఫెస్టో కూడా గత ఎన్నికల్లో విజయానికి ఒక కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే.. ఈసారి కూడా కలిసొచ్చిన ఆ పాత సెంటిమెంట్‌నే రిపీట్ చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. అయితే.. ఈసారి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేతం కోసం ప్రస్తుత పథకాల కొనసాగింపుతో పాటు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే అన్ని వర్గాలను మెప్పించేలా మేనిఫెస్టో సిద్ధమైందని.. ఇక ప్రకటించటమే తరువాయి అని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి.