ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుకుతున్న పలుకులన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులేనని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలనే ఆయన వల్లిస్తుండటాన్ని బట్టి అవన్నీ కిరాయి పలుకులు, కిరాయి ప్రకటనలేనని స్పష్టమవుతోందన్నారు. గతంలో పార్టీలకు వ్యూహకర్తగా డబ్బులు తీసుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఒక్కో స్టేట్మెంట్కు లెక్కగట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ పేర్కొనటాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన బిహార్లో రాజకీయ అరంగేట్రంతో పాదయాత్ర చేశారన్నారు. అయితే బిహార్లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ డీల్ కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు.