ఒక పీకే (పవన్ కళ్యాణ్) వల్ల కావడం లేదనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో పీకే (ప్రశాంత్ కిశోర్)ను తెచ్చుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని(వెంకట్రామయ్య) ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో ఓడిపోనుండగా రాష్ట్రంలో చంద్రబాబు– పవన్‌కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని సామాన్యులు సైతం చెబుతున్నారన్నారు. చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడాపెడా హామీలు ఇచ్చేయాలని ఆయనకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశాంత్ కిశోర్‌ను ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఎందుకు సూచించారని నిలదీశారు. ఏపీలో అసలు సర్వే టీమ్‌లే లేని ప్రశాంత్ కిశోర్ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం గత ఐదేళ్లుగా ఎలా ముందుకు వెళ్లాయని నిలదీశారు. డీబీటీ, అభివృద్ధి రెండూ చేయని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిశోర్ చెప్పడానికి కారణం నెల క్రితం నేరుగా చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ పలుమార్లు రహస్యంగా చంద్రబాబును కలవడం నిజం కాదా? అని నిలదీశారు. ఒక ప్రకటనతో మొత్తం ప్రజల నాడిని మార్చేయవచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ప్రశాంత్ కిశోర్ ముగ్గురూ పచ్చి అబద్ధాల పోటీల్లో ప్రపంచ ఛాంపియన్లే అని వ్యాఖ్యానించారు.