పొత్తుల వ్యవహరం బీజేపీ కేంద్ర అధిష్ఠానం చూసుకుంటుందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి. బిట్రా శివన్నారాయణ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పార్టీని వచ్చే ఎన్నికల్లో సమాయత్తం చేసేలా ఈరోజు సమావేశం జరిగిందని చెప్పారు. మొత్తంగా 14 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ చర్చించారని తెలిపారు. రేపు 11 పార్లమెంటు పరిధుల్లోని నేతలతో చర్చిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు బేరీజు వేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పార్టీలో పొత్తుల మీద చర్చే జరగలేదని చెప్పారు. పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతమేనని తేల్చిచెప్పారు. గతానికంటే ఎక్కువగా పది శాతం ఓటింగ్ పెరిగేలా చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రజలు బీజేపీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర పథకాల ద్వారా ఏపీలో 37 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకురిందని చెప్పారు. ఆ లబ్ధిదారుల కుటుంబాలను కలుస్తామని బిట్రా శివన్నారాయణ హామీ ఇచ్చారు.