రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేది టీడీపీ నేతలేనని, ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వంటి గుంటనక్కలతో పవన్ ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. పవన్‌ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందన్నారు. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాతాళానికి తొక్కి, టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో ‘ఎన్నికలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సిద్ధం’ పేరిట స్థానిక ఎంపీ, వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కొడాలి నాని మాట్లాడుతూ.. పవన్‌ను ఓడించేందుకు సీఎం వైయస్ జగన్ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని.. రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైయస్ఆర్ సీపీ గెలవాలన్నది సీఎం వైయస్ జగన్ ఉద్దేశమని, ఓడే వాళ్లలో బాబు, పవన్, లోకేశ్ కూడా ఉండవచ్చని అన్నారు. ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, డ్రామోజీ, టీవీ–5, పౌడర్ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలిచ్చిన చంద్రబాబు.. 20 శాతం ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లే ఇచ్చాడని దుయ్యబట్టారు. ఇవ్వడానికి చంద్రబాబుకు.. తీసుకునేందుకు పవన్‌కు సిగ్గుండాలని విమర్శించారు.