ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది.అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరగనున్న సభసలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది మహిళలకు నిధులు అందనున్నాయి. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు.నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళలకు రూ.75 వేల సాయం అందనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా సీఎం జగన్ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది.