ఫేమస్ ఆస్ట్రేలియన్-అమెరికన్ బిజినెస్‌మెన్, మీడియా టైకూన్, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ మరో పెళ్లికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే 4 పెళ్లిళ్లు, 5 ఎంగేజ్‌మెంట్‌లు చేసుకున్న రూపర్ట్ మర్దోక్.. తాజాగా మరో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పటికే నలుగురు భార్యలకు విడాకులు ఇచ్చిన రూపర్ట్ మర్దోక్.. 93 ఏళ్ల వయసులో ఐదో వివాదం చేసుకునేందుకు రెడీ అయ్యారు. తన స్నేహితురాలు, 67 ఏళ్ల ఎలీనీ జుకోవాను మనువాడనున్నారు. వీరికి ఇటీవలె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. దీంతో ఈ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారాయి.
కాలిఫోర్నియాలోని తన ఎస్టేట్‌లో రూపర్ట్ మర్దోక్, ఎలీనీ జుకోవాను ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకోనున్నట్లు ఆ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యేవారికి ఆహ్వాన పత్రికలు కూడా పంపించినట్లు సమాచారం. రూపర్ట్ మర్దోక్‌కు ఇప్పటికే 4 పెళ్లిళ్లు, 5 ఎంగేజ్‌మెంట్లు అయ్యాయి. గత సంవత్సరం ఆన్ లెస్లీ స్మిత్‌తో రూపర్ట్ మర్దోక్‌కు ఎంగేజ్‌మెంట్ కాగా.. నెల రోజుల లోపే వారిద్దరూ విడిపోయారు. దీంతో వారికి పెళ్లి జరగలేదు. దీంతో ఈ ప్రస్తుతం ఆరో ఎంగేజ్‌మెంట్ కాగా.. జూన్‌లో ఐదో వివాహం జరగనుంది.
కొన్ని నెలల కిందట రూపర్ట్ మర్దోక్‌కు మాజీ భార్య విన్‌డీ డెంగ్ ఇచ్చిన ఓ పార్టీలో ఎలీనీ జుకోవా.. ఆయనకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉండగా.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారు. రష్యాకు చెందిన ఎలీనీ జుకోవా.. అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. ఎలీనీ జుకోవాకు గతంలో మాస్కో ఆయిల్ బిలియనీర్ అయిన అలెగ్జాండర్‌తో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ పుట్టిన కుమార్తె దాషా.. రష్యన్ ఓలిగార్క్‌ను వివాహం చేసుకోగా.. వారు తర్వాత విడాకులు తీసుకున్నారు.
ఇక రూపర్ట్ మర్దోక్ విషయానికి వస్తే.. ఆయన మొట్టమొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్ అనే మహిళను పెళ్లి చేసుకోగా.. 1960 ల్లో వారు విడాకులు తీసుకుని దూరం అయ్యారు. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నా మరియా మన్‌ను పెళ్లి చేసుకుని విడిపోయారు. అనంతరం చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌ను వివాహం చేసుకున్న రూపర్ట్ మర్దోక్ ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా మోడల్ జెర్రీ హాల్‌ను పెళ్లి చేసుకున్నా.. చివరికి ఆమెతో కూడా విడిపోయారు. ఇక తన రెండో భార్య జర్నలిస్ట్ అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సమయంలో రూపర్ట్ మర్దోక్ చెల్లించిన భరణం.. అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. అప్పుడు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తిని భరణంగా రాసి ఇచ్చినట్లు సమాచారం.
1950 ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన రూపర్ట్ మర్దోక్.. న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ న్యూస్ పేపర్లను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్ సంస్థలను కొనుగోలు చేశారు. 1996 లో ఫాక్స్ న్యూస్‌ను ప్రారంభించిన రూపర్ట్ మర్దోక్.. 2013 లో న్యూస్‌కార్ప్ సంస్థను స్థాపించారు. ఇక తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్న మర్దోక్.. 2011లో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం కారణంగా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసివేశారు. ఇక 2023 సెప్టెంబరులో తన వ్యాపారాలు మొత్తాన్ని కుమారులకు అప్పగించిన రూపర్ట్ మర్దోక్.. ప్రస్తుతం ఆయా సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.